జగన్‌పై దాడి కేసు.. హైకోర్టులో నేడు విచారణ

వైసీపీ అధినేత జగన్‌పై దాడి ఘటన కేసు విచారణ ఇవాళ హైకోర్టులో జరగనుంది. ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు, రిట్‌ పిటిషన్లను కలిపి విచారణ జరపవచ్చా.. లేదా అనే అంశంపై నేడు విచారణ జరగనుంది. తనపై దాడి కేసులో రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధంలేని దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని కోరుతూ జగన్‌ రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై గురువారం విచారణ చేపట్టిన కోర్టు.. ఇవాళ మరోసారి వాదనలు విననుంది.

మరోవైపు.. ఈ కేసును స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలంటూ వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి, సీబీఐతో విచారణ జరిపించాలని వైసీపీ నేతలు అనిల్‌కుమార్‌, అమర్‌నాథ్‌ రెడ్డి వేర్వేరుగా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఇవన్నీ కలిపి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాధాకృష్ణన్‌ ధర్మాసనం ముందుకు వచ్చాయి. స్వయంగా బాధితుడే రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసినప్పుడు ఇంకా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు ఎందుకని హైకోర్టు కేసు విచారణ సందర్భంగా ప్రశ్నించింది.

Also Read : డిఎంకే అధినేత స్టాలిన్‌తో చర్చలు జరపనున్న చంద్రబాబు

ప్రజాప్రయోజన వ్యాజ్యాలు, రిట్‌ పిటీషన్లను కలిపి విచారణ జరుపవచ్చా లేదా అంశంపై కోర్టు ఇవాళ విచారణ చేయనుంది. పోలీసుల దర్యాప్తు ఎంతవరకు వచ్చిందో తెలుసుకుని వచ్చే మంగళవారం విచారణ చేపడతామని కోర్టు తెలిపింది. ఇప్పటికే ఆలస్యం జరిగినందున వెంటనే విచారణ జరిపించాలని హైకోర్టును జగన్‌ తరఫు న్యాయవాది కోరారు. దీంతో న్యాయస్థానం ఈ కేసు విచారణను ఇవాళ్టికి వాయిదా వేసింది.