అమరావతిలో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి శ్రీకారం

kondaveeti vagu lift project working is over

ఆంధ్రుల కలల రాజధాని అమరావతి నగర భవిష్యత్తుకు భరోసానిచ్చే ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. వందల కోట్ల రూపాయల వ్యయంతో రేయింబవళ్లు శ్రమతో నిర్మించిన కొండ వీటి వాగు లిఫ్ట్ నిర్మాణం పూర్తయ్యింది. ప్రకాశం బ్యారేజ్ పడమర దిక్కున వేలాది క్యూసెక్కుల వరద ప్రవాహాన్ని కృష్ణాలోకి ఎత్తిపోసే లిఫ్ట్‌లను రెడీ చేశారు. 14 మోటర్లు, 14 పంప్ లతో….. ఉరకలు వేసే కొండవీటి వాగు నీటిని కృష్ణా నదిలోకి మళ్లిస్తారు..

రాజధాని నిర్మాణం జరుగుతున్న అనంతవరం గ్రామం నుంచి దాదాపు 20 కిలోమీటర్లు ప్రవహించి ఉండవల్లి గ్రామం వద్ద కృష్ణా నదిలో కొండవీటి వాగు కలుస్తుంది. 1964లో వాగునీరు నదిలో కలిసే చోట రెగ్యులేటర్ నిర్మించారు. అయితే వర్షాకాలంలో నదిలో నీటి ప్రవాహం ఉంటే వాగు నీరు దిగువకు వెళ్లే అవకాశం ఉండదు. దీనికి తోటు విజయవాడ థర్మల్ పవర్ ప్లాంట్‌లో విద్యుత్ ఉత్పత్తి జరగాలంటే ప్రకాశం బ్యారేజ్ వద్ద ఎప్పుడూ 12 అడుగుల నీటి మట్టం కొనసాగించాల్సి ఉంటుంది. కాబట్టి, నదిలో పూర్తిగా నీరు ఉన్నప్పుడు వాగు నీరు ఇందులో కలిసేందుకు అవకాశం ఉండదు. ఈ కారణంగా వాగు వేల ఎకరాల్ని ముంచెత్తుతోంది..

రాష్ట్ర విభజన తర్వాత రాజధాని నిర్మాణానికి అమరావతి ప్రాంతాన్ని ఎంపిక చేసాక… ఇక్కడ పొంచి ఉన్న ముంపు ముప్పు తెరపైకి వచ్చింది. దీనిపై ప్రభుత్వం పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సచివాలయం మునిగి పోతుందనే ప్రచారం కూడా విస్తృతంగా జరిగింది. వీటన్నింటికి సమాధానంగా ప్రభుత్వం కొండవీటి వాగు నిర్మాణం చేపట్టింది. కొండవీటి వాగు, పాల వాగుల నుంచి ఉన్న ముంపు ముప్పు తొలగించేందుకు ప్రభుత్వం అంతర్జాతీయ సంస్థల సహకారం తీసుకుంది. సముద్ర మట్టం కంటే తక్కువ లోతులో ఉండే నెదర్లాండ్స్ సాంకేతిక సహకారంతో వాగుల మళ్లింపు డిజైన్ చేశారు. అక్కడి సాంకేతిక పరిజ్ఞానంతో టాటా కన్సల్టెన్సీ ద్వారా వాగుల ప్రవాహాన్ని డిజైన్ చేశారు. 19.85 కిలోమీటర్ల దూరం ప్రవహించే కొండవీటి వాగును ప్రస్తుతం ఉన్న 8 మీటర్ల వెడల్పు నుంచి 20 మీటర్ల కు పెంచుతారు. వైకుంఠపురం వద్ద కృష్ణా నదిలో కలిసే పాల వాగు వెడల్పు 10 మీటర్ల నుంచి 45 మీటర్లకు పెంచుతారు.

కృష్ణా తీరంలో నిర్మిస్తోన్న రాజధాని నగర అవసరాలకు ఉపయోగపడేలా వాగుల ప్రవాహాన్ని ఉపయోగిస్తారు. ఉండవల్లి వద్ద 12 వేల క్యూసెక్కుల నీటిని మోటర్లతో కృష్ణా నదిలోకి లిఫ్ట్ చేస్తారు. 4500 క్యూసెక్కుల నీటిని లిఫ్ట్ వెనక నుంచి బకింగ్ హమ్ కెనాల్ కు మల్లిస్తారు. 100ఏళ్లలో కొండవీటి వాగు గరిష్టంగా 16,575 క్యూసెక్కుల ప్రవాహం నమోదు చేసుకుంటే ప్రభుత్వం 21వేల క్యూసెక్కుల ప్రవాహానికి అనుగుణంగా డిజైన్ చేసింది. దీంతో పాటు పాల వాగు ప్రవహించే మార్గాల్లో క్రిష్ణాయపాలెం, నీరుకొండ, శాఖమూరు వద్ద మూడు రిజర్వాయర్లు నిర్మిస్తారు. వీటిలో అర టీఎంసీ నీటిని నిల్వ చేస్తారు. లామ్, పెద పరిమి, వైకుంఠపురం వద్ద రిజర్వాయర్లు నిర్మించి 0.8 టీఎంసీల నీరు నిల్వ చేస్తారు. కాల్వలలో నిల్వ చేసే నీటితో కలిపి 2.13 టీఎంసీల నీటిని నిల్వ చేయనున్నారు. తద్వారా జల సంరక్షణ, నీటి వనరుల సద్వినియోగం చేస్తూనే.. రాజధానికి ముంపు ముప్పు తప్పేలా కొండవీటి వాగు లిఫ్ట్ ఇరిగేషన్ సిద్ధమైంది.